*🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి*
*🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్*
*🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఉన్న ఆచార్య ఆర్.లింబాద్రి పూర్తిస్థాయి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. వైస్‌ఛైర్మన్‌గా ఓయూ వృక్షశాస్త్ర విభాగం విశ్రాంత ఆచార్యుడు షేక్ మహమూద్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆమోదం మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం జీఓ జారీ చేశారు. మూడేళ్లపాటు ఆ పదవుల్లో కొనసాగనున్నారు. 2017 ఆగస్టు 3న ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు-1గా నియమితులైన లింబాద్రి, 2021 ఆగస్టు 24న తుమ్మల పాపిరెడ్డి స్థానంలో ఇన్‌ఛార్జి ఛైర్మన్ అయ్యారు. ఆయన ఓయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ ఆచార్యుడు. వచ్చే నెలలో పదవీ విరమణ పొందనున్నారు.*
*💥నిరుపేద కుటుంబం నుంచి...*
*🌀నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో అత్యంత పేద దళిత కుటుంబంలో జన్మించిన లింబాద్రి అష్టకష్టాలు పడి చదువుకున్నారు. తన గ్రామం నుంచి డిగ్రీ పూర్తి చేసిన తొలి వ్యక్తి అయ్యారు. పట్టుదలతో పీహెచ్‌డీ వరకు చదివి ఓయూలో సహాయ ఆచార్యుడిగా ఎంపికయ్యారు. గతంలో తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, ఓయూ ఉపకులపతి ఓఎస్‌డీగా వ్యవహరించారు. ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఉన్నకాలంలో బీటెక్‌కు దీటుగా డిగ్రీలో బీకాం బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ హానర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, స్కిల్ ఓరియంటెడ్ కోర్సులను ప్రవేశపెట్టడంలో చొరవ తీసుకున్నారు. ఇంజినీరింగ్‌తో పోటీగా కొలువులు దక్కాలని భావించి డిగ్రీ పరీక్షలు, మూల్యాంకనంలో మార్పులకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఒప్పందం కుదుర్చుకొని అధ్యయనం చేయించారు. ఉపాధ్యక్షుడిగా నియమితులైన మహమూద్ రెండేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఉన్నత విద్యామండలిలో ఇప్పటికే మరో ఉపాధ్యక్షుడిగా ఆచార్య వి.వెంకటరమణ ఉన్నారు.*